ట్రెండ్‌గా మారిన సీఎం విజయ్‌ స్టైల్‌.. ఆ కాంబో బట్టల కోసం ఎగబడుతున్న జనం

  • వైరలవుతున్న బ్లాక్‌ బ్లేజర్‌, వైట్‌ షర్ట్‌
  • ఈ కాంబోను అమ్ముతున్న చెన్నై సిల్క్స్‌
  • లుక్‌ను ఇష్టపడుతున్న యూత్‌
  • కమర్షియల్‌ ప్రమోషన్లపై సోషల్‌ మీడియాలో విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌కు తెరలేపారు. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్‌ సీఎం అయ్యాక ధరిస్తున్న బ్లాక్‌ బ్లేజర్‌, తెల్లటి షర్టు, ఫార్మల్‌ ప్యాంట్ల స్టైల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బట్టల దుకాణాలు కూడా సిద్ధమయ్యాయి.

ప్రముఖ రిటైల్‌ నెట్‌వర్క్‌ ‘ది చెన్నై సిల్క్స్‌’ సీఎం లుక్‌ పేరుతో కొత్త దుస్తుల కాంబోను మార్కెట్లోకి తెచ్చింది. విజయ్‌ సీఎం ఆఫీసులో వేసుకునే బ్లాక్‌ సూట్‌, వైట్‌ షర్ట్‌ సెట్‌ను ప్రత్యేక ప్యాకేజీగా ప్రమోట్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన యాడ్స్‌, పోస్టర్లు సోషల్‌ మీడియాలో రావడంతో విజయ్‌ అభిమానులు, నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో హల్చల్‌ చేస్తున్నారు.

సాధారణంగా తమిళనాడు రాజకీయాల్లో నేతలు తెల్లటి చొక్కా, ధోతి ధరించడం ఒక సంప్రదాయం. కానీ విజయ్‌ ఈ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేశారు. ఆయన కార్పొరేట్‌ బాస్‌ తరహాలో బ్లేజర్లు, పాలిష్డ్‌ షూ ధరిస్తూ కొత్త సీఎం కోర్‌ ఫ్యాషన్‌ యుగాన్ని తెచ్చారు. ఈ సరికొత్త మేకోవర్‌ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

విజయ్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వేసుకున్న వైట్‌ షర్ట్‌, బీజ్‌ (లేత గోధుమరంగు) ప్యాంట్ల స్టైల్‌ పెద్ద ట్రెండ్‌గా మారింది. పోలింగ్‌ రోజున చాలా మంది యువకులు అదే తరహా దుస్తులు వేసుకొని ఓటు వేయడానికి వచ్చారు. సినిమాలో ఆయన చూపే మాస్‌ ఫ్యాషన్‌ స్టైల్‌ ఇప్పుడు నిజ జీవిత రాజకీయాల్లో కూడా కొనసాగుతుండడం విశేషం.

అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లుక్‌ను కమర్షియల్‌ బ్రాండింగ్‌ కోసం వాడుకోవడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఫ్యాషన్‌ మార్కెటింగ్‌ కోసం సీఎం ఇమేజ్‌ను వాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడి కోటు షాపింగ్‌ ట్రెండ్‌గా మారడం విజయ్‌ క్రేజ్‌కు అద్దం పడుతోంది.

Vijay CM
Tamil Nadu CM Vijay
CM Vijay style
Chennai Silks
Vijay fashion trend
black blazer white shirt
political fashion
Tamil Nadu politics
CM office look
youth fashion

More Telugu News